బిజెపితో ఎప్పుడూ పొత్తు ఉండదు: చంద్రబాబు
వరంగల్: జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పొత్తులపై ఆలోచిస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజెపితో భవిష్యత్తులో కూడా పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. బుధవారంనాడు ఆయన వరంగల్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరంగల్ డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీలకు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకోకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ఏ బాట పడతారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ శాసనసభ్యుడితో సహా ఎంతో మంది తమ పార్టీ కార్యకర్తలను హత్య చేయించారని, ప్రజాస్వామ్య మనుగడకు రాజకీయ పార్టీల మనుగడ ముఖ్యమని, రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులను చేసే సంస్కృతి మంచిది కాదని ఆయన అన్నారు. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు వంటివాటిపై ఉన్న ఆసక్తి కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంపై లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఆజంజాహీ మిల్లు కోసం కాంగ్రెస్, టి ఆర్‌యస్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇస్తున్నవి రేషన్‌కార్డులు కాదని ఎన్నికల కార్డులని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
