బుద్ధావతారం ఎత్తా, రెచ్చిపోను: ఎమ్మెస్సార్
కరీంనగర్/ మెదక్: తాను బుద్ధావతారం ఎత్తానని, రెచ్చగొడితే రెచ్చిపోనని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు అన్నారు. తన రాజకీయ చరిత్రను, తాను కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలను ఆయన బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటయిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వివరించారు. తెలంగాణపై, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) వైఖరిపై మీడియా ప్రతినిధులు వేసిన ఏ ప్రశ్నలకు కూడా ఆయన జవాబు ఇవ్వలేదు. వ్యవస్థ మారిందని, తన లాంటి వారు రాజకీయాల్లో ఇమడలేరని ఆయన అన్నారు. దేవుడికి తప్ప తాను ఎవరికీ భయపడనని ఆయన చెప్పుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) పతనం తప్పదని పర్యాటక శాఖ మంత్రి జె. గీతారెడ్డి బుధవారం మెదక్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర మంత్రి, టి ఆర్‌యస్ నేత ఎ. నరేంద్ర నోరును అదుపులో పెట్టుకోవాలని ఆమె సూచించారు. నరేంద్ర వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా మహిళలను కించపరిచేవిగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. నరేంద్ర వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు సహించరని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుని కెసి ఆర్, నరేంద్రలు ప్రజాస్వామయుతంగా విమర్శలు చేయాలని ఆమె హితవు చెప్పారు. టి ఆర్‌యస్ నేతలు హింసను ప్రేరేపిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
