యువతకు కేంద్రం బంపర్ ఆఫర్.. రీల్ చెయ్యండి రూ.50 వేల ప్రైజ్ మనీ గెలుచుకోండి!
దేశంలోని యువతకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. యువతలో ప్రస్తుతం ఉన్న రీల్స్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని యువతకు రీల్స్ కాంటెస్ట్ పెట్టింది. యువత రీల్స్ చేయడంలో ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆకర్షణీయమైన అవకాశాన్ని అందిస్తోంది. ఆరోగ్య సేతు 2.0 రీల్ మేకింగ్ కాంపిటీషన్ పేరుతో నేషనల్ హెల్త్ అథారిటీ మరియు myGov కలిసి ఈ పోటీని నిర్వహిస్తున్నాయి.
డిజిటల్ హెల్త్ సేవలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో చూపించే రీల్ చేస్తే రూ.50 వేల ప్రైజ్ మనీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ సేవలు అందుతున్నాయి.ఈ పోటీలో పాల్గొనే వారు ఆరోగ్య సేతు యాప్ ఫీచర్లను ప్రధానంగా చూపించాలి.

ABHA కార్డు సృష్టి, డిజిటల్ హెల్త్ కార్డ్ యాక్సెస్, సమీప జన ఔషధి కేంద్రాల వివరాలు, స్కాన్ అండ్ పే, స్మార్ట్ AI, హెల్త్ డాష్‌బోర్డ్ వంటి సౌకర్యాలను సులభంగా అర్థమయ్యేలా రీల్‌లో చూపించాలి. ఒక వ్యక్తి, కుటుంబం లేదా వృద్ధులు ఈ యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో స్కిట్ లేదా యానిమేషన్ రూపంలో చూపించవచ్చు. భారతదేశంలో డిజిటల్ హెల్త్ వ్యవస్థ ప్రజలకు ఎలా మేలు చేస్తుందో కూడా వివరించాలి.
ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. రీల్ పూర్తిగా ఒరిజినల్‌గా, సొంతంగా తయారు చేసినదై ఉండాలి. గతంలో ఎక్కడా ప్రచురించి ఉండకూడదు. వీడియో పోర్ట్రెయిట్ మోడ్‌లో, MP4 ఫార్మాట్‌లో ఉండాలి. గరిష్ఠంగా 90 సెకన్ల నిడివి ఉండాలి. రాజకీయ, మతపరమైన లేదా అనుచిత కంటెంట్ ఉండకూడదు.
సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియో పబ్లిక్ లింక్‌ను Word లేదా PDF ఫైల్‌లో సమర్పించాలి. దీనికి సంబంధించి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. ఇందులో పాల్గొనే విధానం చాలా సులభం. ముందుగా రీల్‌ను యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి లింక్ కాపీ చేసుకోవాలి. తర్వాత myGov వెబ్‌సైట్‌లో లాగిన్ అయి 'Aarogya Setu 2.0 Reel Making Competition' టాస్క్‌ను ఎంచుకుని లింక్‌ను సబ్మిట్ చేయాలి.
సెప్టెంబర్ 9, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఎంట్రీలు స్వీకరిస్తారు. విజేతల వివరాలను myGov వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఉత్తమ రీల్‌కు రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తారు.
రీల్ చేయడంలో ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని కోల్పోకుండా పాల్గొని ప్రైజ్ మనీ సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు myGov పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.మరెందుకాలస్యం యువత ఈ అవకాశం అసలే వదులుకోవద్దు.













Click it and Unblock the Notifications
