రెండు ఎన్‌కౌంటర్లు: నలుగురు నక్సల్స్ హతం
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సలైట్లు మరణించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, గుంటూరు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గుంటూరు జిల్లా వెల్లటూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మరణించాడు. ఇతన్ని ఇంకా గుర్తించాల్సి వుంది.
అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చినరాయునిపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన గ్రేహౌండ్స్ పోలీసు బలగాలకు నక్సలైట్లు తారసపడ్డారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ రెండున్నర గంటల పాటు సాగినట్లు సమాచారం. మరణించిన నక్సలైట్లను మద్దిలేరు ప్లాటూన్ డిప్యూటీ దళ కమాండర్ నాగార్జున అలియాస్ ఆర్కే, దళసభ్యులు ఆది అలియాస్ శ్యామ్, బెస్త రాఘవేంద్ర అలియాస్ రవిలుగా గుర్తించారు. దళకమాండర్ ఆనంరెడ్డి అలియాస్ మల్లికార్జున ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నట్లు జిల్లా ఎస్‌పి సంజయ్‌కుమార్ జైన్ చెప్పారు. మొత్తం ఏడుగురు నక్సలైట్లు తప్పించుకున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications