మున్సిపల్ పోల్స్: ప్రచార ఘట్టానికి తెర
హైదరాబాద్: రాజకీయ పార్టీల నేత పరస్పర దూషణల మధ్య మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టానికి గురువారం సాయంత్రం తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాల మధ్య తప్ప ఇతర పార్టీలేవీ పొత్తులు, సర్దుబాట్లు లేకుండానే మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో తెగదెంపులు చేసుకోగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెస్‌తో స్నేహాన్ని తెంచుకుంది. కాంగ్రెస్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా తెరాస, బిజెపి నాయకులు విమర్శల జడివానను కురిపించారు. తెరాస నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తెరాస నాయకుడు ఎ. నరేంద్ర చేసిన ఘాటైన విమర్శలకు తానేమీ మాట్లాడబోనంటూనే అదే భాషలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సమాధానమిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంతా తానే అయి మున్సిపాలిటీలను చుట్టుముట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిపైన ఆయన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రచారం కొనసాగించారు. తెరాస నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కెసి ఆర్, నరేంద్రలు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి, కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసిందంటూ నిప్పుల వర్షం కురిపించారు.
బిజెపి అటు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలకు సమాధానాలు ఇస్తూ పోయింది. వామపక్షాలు తెలుగుదేశంపై కన్నా తెలంగాణ రాష్ట్ర సమితిపైనే ఎక్కువగా తమ వాగ్బాణాలను సంధించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో పాల్గొనకపోవడంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే రాజీవ్ నగర బాట పేర ఆయన మున్సిపాలిటీలను చుట్టి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు ప్రధాన పాత్ర పోషించారు.
ప్రచారం చివరి రోజు గురువారం చంద్రబాబునాయుడు తన సొంత జిల్లా చిత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. తన జిల్లా కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు కర్నూలులో రోడ్‌షో నిర్వహించారు. తెరాస నాయకుడు కె. చంద్రశేఖర్ రావు నిజామాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. అన్నం పెట్టిన తెలంగాణకు కాంగ్రెస్ సున్నం చుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందని ఆయన ధ్వజమెత్తారు.
పోలింగ్ ఎల్లుండి జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది.












Click it and Unblock the Notifications