వరద సహాయ చర్యల్లో విఫలం: విపక్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సోమవారం శాసనసభలో ఈ అంశంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ చర్చ సాగింది. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ వరద బాధితులను పరామర్శించి వెళ్లినా, కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపినా వరదబాధితుల కోసం కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి.
కేంద్రం నుంచి వరద సహాయం రాబట్టడానికి అఖిల పక్ష బృందం ఢిల్లీకి వెళ్లాలని చర్చను ప్రారంభించిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఆ సూచనను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తిరస్కరించారు. అవసరమైతే అఖిల పక్ష కమిటీని పంపిద్దామని, ఇప్పుడు ఆ అవసరం లేదని ఆయన అన్నారు. పంటల నష్టపరిహారాన్ని యాబై శాతం పెంచాలని తెలుగుదేశం చేసిన సూచనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది.
వరద సహాయ చర్యలు భేషుగ్గా జరుగుతున్నాయని చర్చలో పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్ (కాంగ్రెస్) అన్నారు. వరద సహాయ చర్యలు సరిగా చేపట్టి ఉండకపోతే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసి ఉండేది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications