ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రిని: వైయస్
హైదరాబాద్: తాను ఆంధ్రప్రదేశ్ అంతటికీ తాను ముఖ్యమంత్రినని, ఒక్క కడప జిల్లాకు మాత్రమే ముఖ్యమంత్రిని కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తాను కడప జిల్లాకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్లు తెలుగుదేశం నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ఆ మాటలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు కృష్ణానది జాలాల తరలింపు విషయమై జరిగిన చర్చకు ఆయన గురువారం శాసనసభలో వివరణ ఇచ్చారు.
తనకు ఏ ఒక్క ప్రాంతంపై ప్రత్యేకమైన ప్రేమ లేదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తాను పాటుపడుతున్నానని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటనీ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను, వ్యవసాయ రంగాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు నీటి విడుదలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటే స్వర్గీయ ఎన్.టి. రామారావు ఆత్మ క్షోభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు ఎన్.టి. రామారావు ప్రభుత్వమే పాలనాపరమైన అనుమతులిచ్చిందని ఆయన చెప్పారు. కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందిస్తామని, దీని వల్ల తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు మరో ఆరు జిల్లాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు.
తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణ నినాదం ముందుకు వచ్చిందనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలో నిజం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి అన్నారు. పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్‌కు నీటిని తరలించే విషయంలో ప్రభుత్వం మొండిపట్టుతో ఉందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తాము ప్రజల్లోకి వెళ్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications