వోక్స్ స్కామ్‌పై అసెంబ్లీలో రగడ: టిడిపి వాకౌట్
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ వ్యవహారం శుక్రవారం శాసనసభను కుదిపేసింది. జర్మనీ కంపెనీ వోక్స్ వ్యాగన్ కోసం కోసం వశిష్ట వాహన్‌కు 11 కోట్ల రూపాయలు చెల్లించిన వ్యవహారంలో బొత్సా సత్యనారాయణను మంత్రివర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తమ డిమాండ్‌ను అంగీకరించనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనభ నుంచి వాకౌట్ చేశారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రతిష్టనే కాదు, దేశ ప్రతిష్టనే దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. మంత్రి బొత్సా సత్యనారాయణను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోందని, డబ్బులు రికవరీ అవుతున్నాయని ఆయన అంటూ దాంతో సరిపోదని, తప్పుడు చెల్లింపులకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చెల్లింపులకు బాధ్యులైనవారిపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం ఆరోపణలకు మంత్రి బొత్సా సత్యనారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాల విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచారణకు సిద్ధమైతే తాను మంత్రి వర్గం నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications