బాబ్లీ నిలిపివేతకు ప్రధానికి ఎంపిల వినతి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎగువన గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిలిపేయాలనే డిమాండ్‌కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సానుకూలంగా ప్రతిస్పందించారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాస్కీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు మంగళవారంనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వివరణ విన్న ప్రధాని అధికారులను పిలిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మధుయాస్కీ తెలిపారు.
బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తోందని, నిర్మాణాన్ని కొన్ని రోజులు ఆపినట్లే ఆపి మళ్లీ మొదలు పెట్టిందని పార్లమెంటు సభ్యులు ప్రధానికి ఫిర్యాదు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు అందదదని, తెలంగాణ జిల్లాల్లో చేపట్టిన అలీసాగర్ వంటి పలు ప్రాజెక్టులకు నీరు లభ్యం కాదని వారు ప్రధానికి చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై తాము మరో 24 గంటలు వేచి చూస్తామని, అప్పటి వరకు కూడా ఆపకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని మధుయాస్కీ చెప్పారు.












Click it and Unblock the Notifications
