యురేనియం ప్రాజెక్టుకు నిరసనగా వాకౌట్
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టు స్థాపన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (పిపిఐ), భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. యురేనియం ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లా వాసులు కాలుష్య కోరలకు బలవుతారని, దీని వల్ల హైదరాబాద్‌కు కూడా ముప్పు వాటిల్లుతుందని తెలుగుదేశం, సిపియం, మజ్లీస్, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా ప్రజలు ఇప్పటికే ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, యురేనియం ప్రాజెక్టు కూడా వస్తే మరింతగా ఇబ్బందుల పాలవుతారని ప్రతిపక్షాల సభ్యులు అన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే యురేనియం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే కూడా పరిశీలిస్తామని ఆమె చెప్పారు.
మైనర్ పంచాయతీల నిధులను ఇతర పనులకు మళ్లిస్తున్న విషయాన్ని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ సభ దృష్టికి తెచ్చారు. దారి మళ్లించిన పంచాయతీ నిధుల్లో సగం ట్రాన్స్‌కోకు మళ్లించారని, అయినా ట్రాన్స్‌కో పంచాయతీలకు బిల్లులు పంపుతోందని ఆయన అన్నారు. పంచాయతీల నిధుల మళ్లింపు దారి వేసింది గత తెలుగుదేశం ప్రభుత్వమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications
