తెలంగాణవాడిని కాబట్టే వేధింపులు: మాజీ ఎస్‌ఇ
హైదరాబాద్: తాను తెలంగాణవాడిని కాబట్టే ఆంధ్ర లాబీ తనను బలిపశువును చేస్తున్నారని లెల్లంపల్లి ప్రాజెక్టు మాజీ సూపరింటిండెంట్ ఇంజనీర్ విశ్వేశ్వరరావు అంటున్నారు. తనకు మానసిక స్థితి సరిగా లేదని ప్రభుత్వం అనడం తనను వేధించడంలో భాగమేనని ఆయన తెలుగు టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. తనను హైదరాబాద్‌కు బదిలీ చేయడమే కాకుండా నాలుగు నెలల నుంచి వేతనం చెల్లించడం లేదని ఆయన చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకు ఎక్కుతానని ఆయన చెప్పారు.
ఛీఫ్ ఇంజనీర్ సూచన మేరకే తాను ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచినట్లు ఆయన తెలిపారు. ఛీఫ్ ఇంజనీర్ వేధింపులపై తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గతంలో ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు టెండర్ మాత్రమే కాకుండా తాను మరో టెండర్ కూడా తెరిచానని, అందులో ప్రభుత్వానికి 20 కోట్ల రూపాయల లాభం చేకూర్చి పెట్టానని ఆయన చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదటి అంచనా వ్యయాన్ని 1366 కోట్లుగా నిర్ణయించామని, అయితే మిగతా ప్రాజెక్టులతో పోల్చి చూస్తే పొరపాటు జరిగిందంటూ అంచనా వ్యయం పెంచాలని ఛీఫ్ ఇంజనీర్ సూచించారని, ఆ మేరకు 1700 కోట్ల రూపాయల పైచిలుకుకు అంచనా వ్యయాన్ని పెంచామని ఆయన వివరించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేషీలోని ఒక అధికారి వల్లనే తనను హైదరాబాద్‌కు బదిలీ చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
