వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలి: తెరాస
హైదరాబాద్: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన వైఖరిని స్పష్టం చేసినందున వెంటనే పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్షం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని తాము బిజెపిని పట్టుబట్టబోమని విజయరామారావు, ఎ. చంద్రశేఖర్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. యుపిఎ కనీస ఉమ్మడి ప్రణాళిక (సియంపి)లో తెలంగాణపై పేర్కొన్నందున వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వుందని వారన్నారు.
తెలంగాణపై రాతపూర్వకంగా ప్రణబ్ కమిటీకి బిజెపి తన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం లేదని వారన్నారు. శాసనమండలి ఏర్పాటు విషయంలోనూ బిజెపి నోటి మాట ద్వారానే ముందు మద్దతు తెలియజేసిందని వారు గుర్తు చేశారు. ప్రణబ్ ప్రకటన ప్రకారం తెలంగాణకు ఇక ఏ విధమైన అడ్డంకులు లేవని వారన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీకి కట్టుబడి వున్నామని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తూ అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకుల వైఖరిని వారు తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications
