తెలంగాణ అభివృద్ధే లక్ష్యం: ముఖ్యమంత్రి
కరీంనగర్: తెలంగాణ అభివృద్ధే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఆయన పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారంనాడు ముల్కనూరు సహకార బ్యాంకు స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అంశాన్ని తమ నాయకురాలు సోనియా గాంధీకే అప్పగించామని, సోనియానే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి బ్యాంకును ముల్కనూరు బ్యాంకులా అభివృద్ధి పరిచేందుక పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆయుధాలు వదిలి వస్తే నక్సలైట్లతో తాము ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జరగడంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
