ఎల్లంపల్లి అవినీతిపై మరిన్ని ఆధారాలు: దేవేందర్
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందనడానికి తెలుగుదేశం శాసనసభా పక్ష ఉప నాయకుడు టి. దేవేందర్ గౌడ్ మరిన్ని ఆధారాలను బయట పెట్టారు. గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వాటిని బయట పెట్టారు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొడుతున్నవారిపై తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగ విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 16 చెరువులను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇందులో 14 చెరువులు పాతవేనని ఆయన చెప్పారు. ఈ 14 పాత చెరువుల ఫొటోలను ఆయన మీడియా ప్రతినిధులకు చూపారు. కొడిమ్యాల, పోతారం, గంగాధర తదితర పాత చెరువులు పకడ్బందీగా వున్నాయని ఆయన చెప్పారు. చెరువుల పటిష్టతకు 8 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం రాత్రి రాత్రే దాన్ని 86 కోట్ల రూపాయలకు పెంచిందని ఆయన చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో సీనియర్ శాసనసభ్యుడు సిహెచ్. రాజేశ్వరరావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
