అగ్రి వర్సీటీ భూములపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
హైదరాబాద్: ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను ప్రైవేట్ సంస్థలకు అమ్మే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేట్ సంస్థలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను ఇవ్వాలనే ప్రతిపాదనపై పెద్ద యెత్తున నిరసన తలెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోమని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రఘువర్ధన్ రెడ్డి చెప్పారు. గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ, బిజెపి కార్యకర్తలు, విద్యార్థులు గురువారంనాడు ధర్నాకు దిగారు. దీనిపై గురువారం ఉదయం వైస్ చాన్సలర్ రఘవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలిసి వివరాలను అందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదన మాత్రమే చేసిందని, ఈ ప్రతిపాదన ఆమోదం పొందలేదని, అందువల్ల విశ్వవిద్యాలయం భూములను ఎవరికీ ఇచ్చే నిర్ణయం జరగలేదని రఘువర్ధన్ రెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications
