ఈ నెల 10 నుంచి ప్రజాపథం: వైయస్
హైదరాబాద్: ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజాపథం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రెండు విడతలుగా సాగే ప్రజా పథంపై ఆయన గురువారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపథం విధివిధానాలపై, మార్గదర్శకాలపై ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. మొదటి విడత ప్రజాపథం 10వ తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ దీన్ని తాను 9వ తేదీన్నే రంగారెడ్డి, కృష్ణా, వరంగల్ జిల్లాల్లో ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 10వ తేదీన కేంద్ర మంత్రి శరద్‌పవార్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందున ఒక రోజు ముందుగా ప్రజా పథాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మొదటి విడత ప్రజాపథం ఇందిరమ్మ పథకం కిందికి రాని గ్రామాల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరెంట్ సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ, మంచినీటి సరఫరా తదితర సమస్యలను ఈ ప్రజాపథంలో పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇందిరమ్మ గ్రామాల్లో ప్రజాపథం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా 9 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
