పోలీసు కాల్పుల్లో వ్యక్తి మృతి: పోలీసులపై దాడి
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో పోలీసు కాల్పుల్లో నారాయణరావు అనే ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం పెద్ద యెత్తున సహాయం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం, రెండు ఎకరాలు భూమి, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. సంఘటనా స్థలాన్ని ఒయస్‌డి రాజేష్‌కుమార్ సందర్శించారు. నక్సలైట్లతో పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ వ్యక్తి మరణించినట్లు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్‌పి) స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎవరి కాల్పుల్లో అతను మరణించాడో చెప్పలేమని ఆయన చెప్పారు.
సంఘటనపై విచారణ జరిపిస్తామని, పోలీసులది తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాల్పులు యాదృచ్ఛికమని,న సామాన్యుడు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. రాత్రిపూట సామాన్యులెవరో, నక్సలైట్లు ఎవరో తెలియదని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్ హైదరాబాద్‌లో అన్నారు. కాల్పుల్లో వ్యక్తి మరణించడం విచారకరమని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని ఆయన చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ఆరు కిట్ బ్యాగులు, ఒక ఆయుధం స్వాధీనం చేసుకున్నామని యస్‌పి రవీంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications
