మేలో కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు: నరేంద్ర
హైదరాబాద్: మే నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు ఎ. నరేంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామని ఆయన సోమవారం ఒక ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేంద్రంతోనే అవుతుందని ఆయన అన్నారు. తమ నేత కె. చంద్రశేఖర్ రావు మాటల సారాంశం కూడా అదేనని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం విషయంలో తనకు, కెసిఆర్‌కు మధ్య ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి నినాదం బూటకమని ఆయన విమర్శించారు. తెలంగాణకు మద్దతు ఇస్తూ బిజెపి చేసిన ప్రకటన వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలే కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని బిజెపియే తమకు సలహాలు ఇస్తోందని ఆయన అన్నారు. వైయస్ అభివృద్ధి మంత్రంలో కొట్టుకుపోకుండా పార్టీతో కలిసి రావాలని ఆయన పార్టీ అసమ్మతి శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాస రావులకు అధిక నిధులిచ్చి ముఖ్యమంత్రి అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
