ఫాక్షనిస్టులను ప్రజాకోర్టులో నిలబెడతాం: బాబు
విజయవాడ: కాంగ్రెస్ ఫాక్షన్ హత్యలను చూస్తూ ఊరుకోమని, అదే రీతిలో బుద్ధి చెప్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఫాక్షన్ హత్య చేసే కాంగ్రెస్‌వారిని ప్రజా కోర్టుల్లో దోషులుగా నిలబెడుతామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. బిజెపి తెలంగాణ నినాదం హాస్యాస్పదమని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయాన్ని స్థానిక నాయకులకే అప్పగిస్తామని కూడా ఆయన చెప్పారు.
సోనియా గాంధీ త్యాగం చేశారని కాంగ్రెస్ నాయకులు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. సోనియా గాంధీ ఏం త్యాగం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వహణలో ప్రధాని మన్మోహన్ సింగ్ విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలు రైతులకు ఉపయోగపడకపోతే వ్యర్థమని, గత రెండేళ్లలో రైతులు 5.5 కోట్ల రూపాయలు నష్టపోయారని ఆయన చెప్పారు. దేశం 12 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని తాను ఆనాడే చెప్పానని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలు పేదలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. రైతు బజార్లను ప్రైవేటీకరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. సాగునీటిపై రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications