స్వేచ్ఛా వాణిజ్యంతోనే ఆసియా అభివృద్ధి: పియం
హైదరాబాద్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్లనే ఆసియా అభివృద్ధి సాధ్యమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) సమావేశాల్లో ఆయన శుక్రవారంనాడు ప్రసంగించారు. దేశప్రగతి, లక్ష్యంపై ఆయన మాట్లాడారు. మన ప్రాంతం ఆర్థికాభివృద్ధికి సమగ్రమైన భద్రతా చట్రం అవసరమని ఆయన చెప్పారు. ఆసియా దేశాల ఆర్థిక అభివృద్ధి అసమానతలను రూపుమాపడానికి ఎడిబి కృషి చేయాలని ఆయన సూచించారు.
భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు 15వేల కోట్ల డాలర్లు అవసరమని ఆయన చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు ఇతోధిక అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. సంక్షోభంలో చిక్కుకున్న ఆసియా దేశాల ఆర్థికాభివృద్ధిపై ఎడిబి కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయం, పర్యాటకం, నీటి వనరుల రంగాలపై ఎడిబి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తోందని ఆయన చెప్పారు. తాము సార్క్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నామని, ఆసియన్ దేశాలతో, జపాన్, చైనాలతో ఈ విధమైన ఒప్పందాలు చేసుకోవడానికి పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ఈ దిశలో పని చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని సతీమణి గురుశరణ్ కౌరు తాలిబాన్ల చేతిలో హతమైన ఇంజనీర్ భార్య మంజులను ఆస్పత్రిలో పరామర్శించారు.












Click it and Unblock the Notifications