ఈ సమావేశాల్లో వర్గీకరణ బిల్లుకు యత్నం
హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లును ప్రతిపాదించడానికి ప్రయత్నాలు చేస్తామని మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావు చెప్పారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ నెల 19వ తేదీన అఖిల పక్ష బృందం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్గీకరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరుతామని సమావేశానంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఎస్‌సి వర్గీకరణకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయని, అటువంటప్పుడు వర్గీకరణపై చిత్తశుద్ధి లేదనడం సరి కాదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ, సిపియం, మజ్లీస్ హాజరు కాలేదు. కమిటీలు, కమీషన్లు వేయకుండా ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు వెంటనే ఆర్టికల్ 344 (1)ని సవరించాలని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోగా ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం చట్టం తేవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications
