తెరాసను చీల్చే అవసరం లేదు: వైయస్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని చీల్చే ఉద్దేశం తమకు లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీరులో ఒక వివాహానికి హాజరు కావడానికి సోమవారం వెళ్తూ ఢీల్లీలో ఆయన కొద్దిసేపు ఆగారు. ఈ సమయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అవినీతికి సంబంధించి నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలా కాకుండా యధాలాపంగా ఆరోపణలు చేస్తే ఏమీ చేయలేమని ఆయన అన్నారు.
ప్రపంచ బ్యాంకు రుణం వల్ల భారం తక్కువ పడుతుందని, ప్రపంచ బ్యాంకు రుణంపై వడ్డీ తక్కువగా ఉంటుందని, అందుకే తాము ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా ప్రపంచ బ్యాంకు రుణాలు తీసుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు వద్దని చెప్పినా తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, గత రెండేళ్లుగా ఏ ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు. తమకు ప్రజల అవసరాలు ముఖ్యమని, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
