వలసలు ఆరంభమే: తెరాస అసమ్మతి ఎమ్యెల్యేలు
వరంగల్: తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి కార్యకర్తల వలసలు ఆరంభం మాత్రమే కాని అంతం కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులు దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణి అన్నారు. ఈ వలసలతో తెరాస తుడిచిపెట్టుకుపోతుందని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ వలసలకు తమ పార్టీ అగ్రనేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలే బాధ్యత వహించాలని వారు అభిప్రాయపడ్డారు. తమ నేతలు బలహీనపడ్డారని, అందుకే వేలాదిగా తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని వారన్నారు.
కాంగ్రెస్ ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమవుతుందని వారన్నారు. చంద్రశేఖరరావు, నరేంద్రలు పదవీ వ్యామోహంతో ఉద్యమాన్ని విస్మరించారని వారు విమర్శించారు. పదవులు వదిలిపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తాము గత ఆరు నెలలుగా చెప్తున్నా తమ నేతుల పట్టించుకోవడం లేదని వారన్నారు. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న మూడు జిల్లాలు కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి వేలాది పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి వలస వెళ్లారని, ఈ వలసలు ఇంకా కొనసాగుతాయని వారన్నారు. చంద్రశేఖరరావు, నరేంద్రల బాష, నడవడి సరిగా లేవని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు తమ నాయకులిద్దరికి తగిన బుద్ధి చెప్తారని వారన్నారు.












Click it and Unblock the Notifications
