తెలంగాణ వ్యతిరేకులు నలిగిపోతారు: బిజెపి
మహబూబ్‌నగర్: తెలంగాణ వ్యతిరేకులు, వ్యతిరేక పార్టీలు తమ చైతన్య రథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి అన్నారు. బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌తోనైనా కలిసి పని చేస్తానని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాది అని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు తెలంగాణ నేతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాదని, ఒక వేళ వస్తే తెలంగాణకు చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
