మీడియాపై మరోసారి జెసి దౌర్జన్యం
అనంతపురం/ హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి మరోసారి మీడియా ప్రతినిధులపై తన దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. టీవీ - 9 ప్రతినిధిపై ఆయన మరింత దురుసుగా ప్రవర్తించారు. ఆ ప్రతినిధికీ తనకూ వ్యక్తిగత వైరం ఉందని, అందువల్ల తన కార్యక్రమాన్ని కవర్ చేయవద్దని ఆయన అన్నారు. అనంతపురం మార్కెటు యార్డులో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రతినిధిని బయటకు పంపించివేయాలని ఆయన తన అనుచరులను ఆదేశించారు. దీంతో ఆయన అనుచరులు ఆ ప్రతినిధి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు గెంటివేసే ప్రయత్నం చేశారు.
తన కార్యక్రమాన్ని కవర్ చేయవద్దని తాను ఆదేశిస్తున్నానని దివాకర్ రెడ్డి ఆ మీడియా ప్రతినిధితో వాదనకు దిగారు. ప్లీజ్ గెటవుట్ అంటూ ఆయన ఆ ప్రతినిధిని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా మీడియా ప్రతినిధులను కించపరుస్తూ మాట్లాడారు. మంత్రి చర్యకు సర్వత్రా నిరసన వ్యక్తమైంది. మంత్రి చర్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( ఎపియుడబ్ల్యుజె) అధ్యక్షుడు అమరనాథ్ ఖండించారు. మంత్రిపై చర్య తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డిని కోరారు. దివాకర్ రెడ్డి గుండాయిజాన్ని ఎదుర్కోవడానికి జర్నలిస్టులందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి దురుసుతనం విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కోరారు.












Click it and Unblock the Notifications
