బస్సు లోయలో పడి 17 మంది దుర్మరణం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక బస్సు లోయలో పడడంతో 17 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. దోడా జిల్లాలోని రాంబన్ పోలీసు స్టేషన్ పరిధిలో గల బాటరీ చేష్మా వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డుపై అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
బస్సు 400 అడుగుల లోతు గల లోయలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. క్షతగాత్రులను రాంబాన్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్‌లకు చెందిన కూలీలు. గాయపడినవారిలో 16 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. వీరిలో ఇద్దరు జమ్మూ ప్రాంతంలోని రాజౌరి జిల్లాకు చెందినవారు.












Click it and Unblock the Notifications
