ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ దాడిలో 30 మంది మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు దాడి చేసి 30 మందిని దారుణంగా చంపారు. మరో 70 మంది నక్సలైట్ల దాడిలో గాయపడ్డారు. మరో 100 మందిని తమ వెంట బలవంతంగా తీసికెళ్లారు. దాదాపు 800 మంది నక్సలైట్లు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో వెంటవెంటనే సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌పై, ఎర్రబోరు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పునరావాస శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో పునరావాస శిబిరంలోని 30 మంది మరణించారు. దాదాపు 150 ఇళ్లను దగ్ధం చేశారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని పోలీసు అధికారులు చెప్పుకుంటున్నారు. పునరావాస శిబిరంలో వుంటున్నవారందరూ సల్వజుడుం కార్యకర్తలు. క్షత్రగాత్రలను కుంట ఆస్పత్రికి తరలించారు. రెండు హెలికాప్టర్లలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
నక్సలైట్లు మొదట సిఆర్‌పియఫ్ క్యాంపుపై, ఆ తర్వాత పునరావాస శిబిరంపై దాడి చేశారు. నక్సలైట్ల నుంచి ముప్పు ఎదుర్కుంటున్న 400 మంది పునరావాస శిబిరంలో వుంటున్నారు. నక్సలైట్లు మొదట పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో పాటు పునరావాస శిబిరంలోని గుడిసెలను దగ్ధం చేశారు. నక్సలైట్లు కిడ్నాప్ చేసిన 100 మందిలో ఒక మహిళా ప్రత్యేక పోలీసు అధికారి కూడా వున్నారు. వారిని సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లారు. వారిని వెంటాడడానికి సిఆర్‌పియఫ్ జవాన్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నక్సలైట్లు అపహరించుకుని వెళ్లినవారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని దంతెవాడ జిల్లా కలెక్టర్ కె.ర్. సిడా చెప్పారు. అపహరించుకునిపోయినవారిని నక్సలైట్లు చంపినా ఆశ్చర్యం లేదని, నక్సలైట్లు చేసే పనే అదని ఆయన అన్నారు. తన పర్యవేక్షణలో జరుగుతున్న భద్రతా కార్యకలాపాలకు ఈ సంఘటన ఆటంకమేమీ కాదని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వ తీవ్రవాద వ్యతిరేక సలహాదారుగా నియమితులైన కన్వర్ పాల్ సింగ్ గిల్ అన్నారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
