గుంటూరు వైద్య కళాశాలలో పోస్టుమార్టం: హైకోర్టు
హైదరాబాద్: నల్లమల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు గుంటూరు వైద్య కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పౌర హక్కుల సంఘం ప్రతినిధులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం ఆ ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాల సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడంపై హైకోర్టు ప్రభుత్వ ప్రతినిధిని ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం దట్టమైన అడవుల్లో ఉన్నందున ఆ చర్యలు తీసుకోలేకపోయామని ప్రభుత్వ ప్రతినిధి సమాధానమిచ్చారు.
ప్రొఫెసర్ నేతృత్వంలోని బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని, మొత్తాన్ని రికార్డు చేసి వీడియో టేప్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మృతులను గుర్తించడానికి ఒక్కో శవానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుంటూరుకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది. గుర్తించిన మృతదేహాలను గుంటూరు మెడికల్ కాలేజీలోనే భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి వారంలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీన జరుగుతుంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ సోదరుడు కనకయ్య గౌడ్, బంధుమిత్రుల కమిటీ నేత పద్మ ఒంగోలుకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
