ఐదో నెంబర్ జీవో రద్దుకు బిజెపి డిమాండ్
హైదరాబాద్: ఉద్యోగులను తొలగించడానికి జారీ చేసిన ఐదో నెంబర్ జీవోను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవో వల్ల తలెత్తిన పరిణామాలపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బిజెపి జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను తీసేసేందుకు సిద్ధపడిందని ఆయన విమర్శించారు. ఉద్యోగులు పనిచేయడం లేదు కాబట్టి పని చేయించేందుకు బెదిరించాలనే ఉద్దేశంతోనే జీవో జారీ చేశామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అనడం ఉత్తి బుకాయింపు మాత్రమేనని ఆయన అన్నారు.
పని చేయని ఉద్యోగులను బెదిరించడానికే జీవోను ఉద్దేశించామని రోశయ్య చెప్పడం అసంబద్ధమని బిజెపి సీనియర్ నేత సిహెచ్. విద్యాసాగరరావు నల్లగొండలో మీడియా ప్రతినిధులతో అన్నారు. దెబ్బ కనిపించకుండా కొట్టే నైపుణ్యం రోశయ్యకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జీవో జారీ చేసి, జీవోలో వివరణాత్మక అంశాలను చేర్చి అది నిజం కాదంటే ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా వుందని, ఆర్థిక ఎమర్జెన్సీని విధించాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
