బెదిరింపులకేననడం రోశయ్యకే చెల్లింది: రాఘవులు
విజయవాడ: ఉద్యోగులను బెదిరించడానికే జీవో నెంబరు 5ను జారీ చేశామని చెప్పడం ఆర్థిక మంత్రి కె. రోశయ్యకే చెల్లిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం 30 ప్రభుత్వ, సహకార సంస్థల్లో 68 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి జీవోను జారీ చేసిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జీవోపై తమకు స్పష్టత ఉందని, లేనిది రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణకేనని ఆయన అన్నారు.
జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉద్యోగులను తొలగించడానికి ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసిందని ఆయన విమర్శించారు. జీవో నిజమైనప్పుడు అందులోని విషయాలు అర్థరహితం ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. తమ ఆరోపణలు నిరాధారం ఎలా అవుతాయో ప్రభుత్వం వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ జీవో ఆధారంగా తొలి విడత ఎంత మంది ఉద్యోగులను తొలగించారో వెల్లడించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications
