టిడిపి బహిష్కరణ: విపక్షాల నిరసనలు
హైదరాబాద్: కృష్ణా జలాలపై ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. కృష్ణా నది మిగుల జలాలపై బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన హక్కును వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కృష్ణా నది ట్రిబ్యునల్ ముందు ప్రస్తుతం వాదించే న్యాయ నిపుణుల బృందం బలంగా లేదని కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడింది. కొత్త ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలన్నీ విమర్శించాయి. నిరసన తెలియజేస్తూ సమావేశం నుంచి ప్రతిపక్షాల నాయకులు బయటకు వచ్చారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
కృష్ణానది వ్యాలీ అథారిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెరాస నాయకుడు వి. ప్రకాశ్ విమర్శించారు. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే మిగులు జలాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన వాదనను ట్రిబ్యునల్ ముందు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని కె. నారాయణ (సిపిఐ) విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, విమర్శల నుంచి బయట పడడానికే ఇప్పుడు నామమాత్రంగా అఖిల పక్షం ఏర్పాటు చేసిందని సిపియం విమర్శించింది. కడియం శ్రీహరి, కోడెల శివప్రసాదరావు, సానా మారుతి (తెలుగుదేశం), వి. ప్రకాశ్, విద్యాసాగర రావు (తెరాస), కె. నారాయణ (సిపిఐ), జి. కిషన్ రెడ్డి (బిజెపి) తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
