వైయస్ ప్రపంచ బ్యాంకుకు కట్టుబానిస: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రపంచ బ్యాంకు కట్టుబానిసగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టేలా ప్రపంచ బ్యాంకుతో వైయస్ ప్రభుత్వం కొత్తగా ఒప్పందం చేసుకుందని యనమల రామకృష్ణుడు, నాగం జనార్దన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఈ కొత్త ఒప్పందాన్ని ప్రజల ముందు ఉంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులను తొలగించాలని జారీ చేసిన ఐదో నెంబర్ జీవో ఉత్తుత్తిదే అని ఆర్థిక మంత్రి కె. రోశయ్య అనడాన్ని వారు ఎద్దేవా చేశారు. జీవో ఉత్తుత్తిదే అయితే వైయస్ ప్రభుత్వం కూడా ఉత్తుత్తిదేనని వారన్నారు. జీవో అమలు చేయడానికి కాదన్నందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆర్థిక మంత్రి కె. రోశయ్య ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైయస్‌కు, రోశయ్యకు పదవుల్లో కొనసాగే అర్హత లేదని వారన్నారు. వైయస్, రోశయ్య వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఐదేళ్లలో రెండున్నర లక్షల మంది ఉద్యోగులను తొలగించడానికి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుందని వారన్నారు.












Click it and Unblock the Notifications
