షీలా దీక్షిత్ రాజీనామాకు బిజెపి ప్రదర్శన
న్యూఢిల్లీ: శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనందున, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాజీనామా చేయాలని బి.జె.పి. పార్టీ శనివారం ఢిల్లీలో డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బి.జె.పి. నాయకుడు విజయ్ గోయల్ సారధ్యంలో కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్లజెండాలు చేబూని, షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీరు ప్రదర్శన జరిపారు. ఇంద్రలోక్‌లో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి హత్యలో నిందితులను అరెస్టు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని వీరు నిరసించారు. ఈ సందర్భంగా విజయ్ గోయల్ మాట్లాడుతూ, ఢిల్లీలో శాంతిభద్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని, హత్యలు, వృద్ధులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. దేశ రాజధానిలో పెరిగిపోతున్న నేరాలకు బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, సిటీ పోలీసు కమీషనర్ కె.కె. పాల్ రాజీనామా చేయాలని, రాజధానిలో శాంత్రి భద్రతల పరిస్థితిపై గృహమంత్రి ఓ ప్రకటన చేయాలని ఆయన డిమాండు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శకులు షీలా దీక్షిత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications