వరద బాధితులకు పక్కా ఇళ్లు: ముఖ్యమంత్రి
ఖమ్మం/ విజయనగరం/ రాజమండ్రి: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. గోదావరి వరద బాధితులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన అన్నారు. ఆయన ఆదివారంనాడు తూర్పు గోదావరి, విజయనగరం, ఖమ్మం జిల్లాల్లో వరద తాకిడి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. విజయనగరం జిల్లాలోని వనకాడులో కొండచరియ విరిగిపడి మరణించినవారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు 50 రూపాయలేసి చెక్కులను అందజేశారు. రాజమండ్రిలో ఆయన వరద పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు అధికారులు అప్రమత్తంగా వుండాలని ఆయన ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల పాటు గోదావరి నది వరద పెరిగే ప్రమాదం వుందని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 27వేల మంది నిరాశ్రయులయ్యారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యం చెప్పారు.
ఖమ్మంలో ఆయన వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రమాదంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. గోదావరి వరద బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మించినా భద్రాచలానికి ఏ విధమైన ముప్పు వుండదని, సాంకేతిక నిపుణులను తక్కువగా అంచనా వేయవద్దని ఆయన అన్నారు. బాధితులకు సహాయం అందడం లేదని బూర్గుంపాడు శాసనసభ్యుడు సాయం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications
