రింగ్ రోడ్డుపై స్టే: భూమి పోయిన స్త్రీ మృతి
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పనులపై హైకోర్టు రెండు వారాల పాటు స్టే ఇచ్చింది. పది మంది రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం ఈ స్టేను మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నుంచి పెద్దల భూములను తప్పించి, పేదలమైన తమ భూములను చేరుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, దాని వల్ల అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అనేక మెలికలు తిరిగిందని ఫిర్యాదు చేస్తూ వారు పిటిషన్ దాఖలు చేశారు. మొదటి మూడు నోటిఫికేషన్లలో ఈ పది మంది భూములు లేవని, ఆ తర్వాత జారీ చేసిన నోటిఫికేషన్‌లో వీరి భూములను చేర్చారని, మంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల భూములను, వారి బంధువులను భూములను ప్రాజెక్టు నుంచి తప్పించడానికి పేదల భూముల మీదికి తెచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రామచంద్రరావు అంటున్నారు.
ఇదిలావుంటే, అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూమి కోల్పోయిన మహిళ మనోవేదనకు గురై మరణించింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటకు చెందిన సత్యవతమ్మ అనే మహిళకు చెందిన భూమి ప్రాజెక్టులో పోయింది. దీంతో ఆమె తీవ్ర మనో వేదనకు గురైంది. ఆ మనో వేదనతో ఆమె శుక్రవారంనాడు మరణించింది. నష్టపరిహారం అరకొరగా చెల్లించారని ఆమె బాధపడుతూ వుంది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె బంధువులు విజయవాడ - హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మద్దతు ప్రకటించింది. రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. అభివృద్ధి పేరుతో, అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో ప్రభుత్వం 7 వేల మంది పేద రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
