ఈ నెల 24 తర్వాత రాజీనామాలు: నరేంద్ర
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సానుకూలంగా ప్రతిస్పందించకపోతే ఈ నెల 24వ తేదీ తర్వాత కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోగా తాము రాజీనామా చేయడం ఖాయమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ సానుకూలంగా ప్రతిస్పందిస్తే రాజీనామాలు చేసే విషయంపై పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు.
రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ప్రతిస్పందించకపోతే తాము యుపిఎ ప్రభుత్వంలో కొనసాగే పరిస్థితి వుండదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి వి. ప్రకాశ్ అన్నారు. పార్లమెంటులోని 542 మంది సభ్యుల్లో కాంగ్రెస్, వామపక్షాల సభ్యులను పక్కన పెట్టినా 300 మందికిపైగా సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నారని, ఆ మేరకు వారు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు కూడా రాశారని ఆయన చెప్పారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకించడం అప్రజాస్వామికమే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను చిన్న చూపు చూస్తే కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి కోసం ఇంకా నిరీక్షించే పరిస్థితి లేదని తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్‌కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications
