తేల్చుకోవడానికి తెరాస సిద్ధం: ఢిల్లీకి ఎమ్మెల్యేలు
హైదరాబాద్: కాంగ్రెస్‌తో తాడో పేడో తేల్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవులకు తెరాస అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ పార్టీ శాసనసభ్యులతో నరేంద్ర శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రాత్రి చంద్రశేఖరరావు తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమై చర్చలు జరుపుతారు. అలాగే ఆయన తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. శనివారంనాడు (రేపు) చంద్రశేఖరరావు తెలంగాణపై ఏర్పాటయిన సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీని కలుసుకుంటారు. నేతలిద్దరూ కేంద్ర మంత్రి పదవులకు ఈ నెల 21వ తేదీన రాజీనామాలు చేసే అవకాశం వున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకోలేదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు చెప్పారు. కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించకపోతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ శాసనసభ్యులతో అగ్రనాయకులు చర్చించిన తర్వాతనే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి మాత్రం సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ రేపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తీవ్రమైన నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
