వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుది వరద రాజకీయం: వైయస్‌ది ఎదురుదాడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వరదపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా మధ్యలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. 1995 సంఘటనను ఒకదాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై ఆయన ఎదురుదాడికి దిగారు. వరదలను చంద్రబాబునాయుడు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సునామీ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు అలాగే చేశారని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు విజయ సంకేతం చూపుతూ చంద్రబాబు నవ్వులు కురిపించారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సాధారణంగా నవ్వు రాదని, ప్రజలు ఇబ్బందుల్లో వున్నప్పుడు నవ్వు వస్తుందని, ప్రజలు సుఖంగా వుంటే చంద్రబాబుకు నవ్వు రాదని ఆయన అన్నారు. చంద్రబాబు గంటన్నర సేపు మాట్లాడారని, ఒక్కసారి కూడా గోదావరి నది కరకట్టలను పటిష్టం చేయాల్సిన అవసరం వుందని చెప్పలేదని ఆయన అన్నారు. చంద్రబాబువన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు.

తాను బాధితులను ఓదారుస్తూ వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించానని, ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి హైదరాబాద్‌లో కూర్చుని తమపై ఎదురుదాడికి రంగం సిద్ధం చేసుకున్నారని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి విమర్శలకు ప్రతిస్పందిస్తూ అన్నారు. ప్రభుత్వం 25 శాతం మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా నష్టం చాలా తగ్గి వుండేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేయలేకపోయారని ఆయన విమర్శించారు. మంత్రులు కూడా పెద్దగా వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించలేదని ఆయన అన్నారు. ఎదురుదాడి మాని ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదని ఆయన ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. 1995 సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి తనపై చేసిన విమర్శలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హైదరాబాద్‌లో లేనని ముఖ్యమంత్రి చెబుతున్న మాట నిజం కాదని ఆయన అన్నారు. వరదలపై చర్చ సందర్భంగా శుక్రవారంనాడు శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పలు మార్లు వాగ్వివాదం చెలరేగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలకు దిగారు.వరదలపై చర్చకు సోమవారం ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి ప్రకటించారు. అయితే చర్చకు ఈ రోజే సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ సమయంలో తెలుగుదేశం, అధికార కాంగ్రెస్‌ పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. పరస్పర విమర్శలకు దిగాయి. దీంతో చర్చ ముందుకు సాగలేదు. ఇంకా ఇద్దరు ముగ్గురు సభ్యులు మాట్లాడాల్సి వుందని, వారు మాట్లాడిన తర్వాత సోమవారం ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పీకర్‌ పదే పదే చెప్పినా తెలుగుదేశం పార్టీ సభ్యులు వినలేదు. దాంతో సభను అర్థాంతరంగా స్పీకర్‌ సోమవారంనాటికి వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X