కెసిఆర్‌కు తొందరెందుకు?: దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి తొందరెందుకని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తాము తెరాస అధినేత కె. చంద్రశేఖరరావుకు స్పష్టమైన హామీ ఇచ్చామని, తమ నేత సోనియా నిర్ణయం కోసం వేచి చూస్తామని కెసిఆర్ చెప్పారని, అందువల్ల తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని తాము కెసిఆర్‌కు సూచిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీని దిగ్విజయ్ సింగ్ కలిసి 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని, ఏకాభిప్రాయానికి తాము ప్రయత్నిస్తున్నామని, వామపక్షాలను కూడా ఒప్పించడానికి సంప్రదింపులు జరుపుతూనే వున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపైనే కాకుండా ఏ విషయం మీదనైనా సరే భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేసిన ప్రకటనను తాము నమ్మబోమని ఆయన చెప్పారు. తాము బిజెపి మద్దతును తీసుకోబోమని, బిజెపి ప్రకటనలను విశ్వసించబోమని ఆయన చెప్పారు. తెరాస, తాము కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని, కలిసి ప్రభుత్వంలో పని చేస్తున్నామని, ఇంకా 33 నెలలు కలిసి పని చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. తాము ప్రాంతీయాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇదే సమయంలో కెసిఆర్‌తో ఆయన నివాసంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications