కెసిఆర్ పోరాట పాటకు అసమ్మతి వంతలు
హైదరాబాద్: మంత్రి పదవులకు రాజీనామా చేసి పోరాట మార్గం పడుతామని తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు మొక్కయినా తెలంగాణ తెస్తానని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు రాజీనామా చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్లు పెట్టడం తమ మరో అగ్రనేత నరేంద్రకు ఆనవాయితీ అని ఆయన అన్నారు.
సోనియా గాంధీ మీద నమ్మకంతోనే తెలంగాణను సాధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కే తెలంగాణ సాధించాలని ఆయన అన్నారు. ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. మంత్రిపదవులకు రాజీనామా చేయాలని తమ నేతలు నిర్ణయం తీసుకోవడం మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లుగా వుందని మరో అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నన్ను ద్రోహిగా అభివర్ణించిన కెసిఆర్ ఇప్పటికైనా పోరాట మార్గం పట్టాలనుకోవడం సంతోషకరం అని ఆయన అన్నారు. లాబీయింగ్ చేస్తున్నామని ఇంత కాలం కెసిఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ ఇంటి ముందు ధర్నాలు చేయడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications