అసెంబ్లీ: నాలుగో రోజూ తెరాస సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: వరుసగా నాలుగో రోజు గురువారం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకుగాను 18 మంది తెరాస సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తెలంగాణపై తక్షణ చర్చకు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస సభ్యులు గురువారంనాడు కూడా సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణ చిత్రపటం ముద్రించిన నల్లటి టీ షర్లును ధరించిన తెరాస సభ్యులు వెల్‌లో గుమికూడి జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు.
స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి ఎంత నచ్చజెప్పినప్పటికీ తెరాస సభ్యులు వినలేదు. ఈ రోజు తమ వాదనను వినిపించడానికి అవకాశం ఇస్తానని కూడా సురేష్ రెడ్డి వారికి చెప్పారు. అయినా వారు పట్టించుకోలేదు. దాంతో తెరాస సభ్యుల సస్పెన్షన్‌కు తీర్మానం ప్రతిపాదించాలని సురేష్ రెడ్డి శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యకు సూచించారు. దాంతో రోశయ్య తీర్మానం ప్రతిపాదించి ఆమోదం పొందారు. అయినా తెరాస సభ్యులు సభను వీడి వెళ్లకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఈ సమయంలో మార్షల్స్ తెరాస సభ్యులను సభ వెలుపలికి తరలించారు. అనంతరం తెరాస శాసనసభ్యులు శాసనసభ ఎదుట ధర్నాకు దిగారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల్లో పావుగా వాడుకుందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు విమర్శించారు. తెలంగాణ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చి, ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చి తెలంగాణ వాదులను నమ్మించి కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న చోటుకు వెళ్లి కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి తెరాస సభ్యులకు సంఘీభావం తెలియజేశారు. జనార్దన్ రెడ్డిని తెరాస శాసనసభ్యులు ఆలింగనం చేసుకున్నారు. ఆయన చేత జై తెలంగాణ నినాదాలు ఇప్పించారు.












Click it and Unblock the Notifications
