దేశంలోనే అతి పెద్ద స్కామ్: చంద్రబాబు
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూముల సేకరణ వ్యవహారంలో జరిగిన కుంభకోణం భారతదేశంలోనే అతి పెద్దదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. రైతులను మోసం చేసి కొంత మంది పెద్దలు కోటీశ్వరులయ్యారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎంత మంది రైతులు నష్టపోయారని, ఎన్ని మార్లు రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లు మార్చారని, ఎందుకు మార్చాల్సి వచ్చిందని తాము వివరాలు అడిగామని ఆయన చెప్పారు. హైదరాబాద్ భూములకు సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద యెత్తున జరిగిన కుంభకోణం మరోటి లేదని ఆయన అన్నారు. కావాలని ఈ వ్యవహారాన్ని దాచి పెడుతోందని, చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వంలోని పెద్దలు కూడబలుక్కుని రకరకాలుగా పేద రైతుల నుంచి భూములను కాజేశారని, ఇందులో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారని ఆయన అన్నారు. రైతులను మోసం చేశారని ఆయన అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము ప్రభుత్వం డిమాండ్ చేశామని, అందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన చెప్పారు. ఎపిఐఐసి, హుడా అనేక అవకతవకలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి రైతులను బెదిరించి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, తర్వాత అలైన్‌మెంట్‌ను మారుస్తూ మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి మరి కొందరి భూములను కాజేయడం జరుగుతూ వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
