వైయస్ రాజీనామాకు తెరాస డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూ వ్యవహారంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖ రెడ్డి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ భూ కుంభకోణంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు భూముల వ్యవహారాన్ని నిరసిస్తూ తెరాస తెలంగాణ అంతటా మంగళవారంనాడు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఆందోళనకు దిగిన శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డిని, ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు భూముల వ్యవహారంలో తన నిర్దోషిత్వాన్ని ముఖ్యమంత్రి రుజువు చేసుకోవాలని నాయని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.
వరంగల్‌లో తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు పెద్ద యెత్తన ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రైతుల పొట్ట కొడుతున్నారని విజయరామారావు విమర్శించారు. ఆంధ్ర వలస పాలకులు తెలంగాణ భూములను కబ్జా చేస్తున్నారని, దీన్ని అడ్డుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ వనరులను ఆంధ్ర వలసపాలకులు కొల్లగొడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ భూములను పోరాటం చేసి రక్షించుకుంటామని ఆయన అన్నారు. కరీంనగర్‌లో తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.












Click it and Unblock the Notifications
