భూ స్కామ్‌పై విపక్షాలది రాజకీయం: వైయస్
తిరుపతి: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూముల వ్యవహారంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అయినా ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి తగిన ప్రతిస్పందిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు భూములపై ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వారికి ఏం కావాలట? అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాసనసభ్యుడు నారాయణస్వామి సోదరుడిని ఆయన పరామర్శించారు.
అవుటర్ రింగ్ రోడ్డు భూముల వ్యవహారంపై విచారణ జరిపిస్తారా, మరో విధంగా ప్రతిస్పందిస్తారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన జవాబు దాటవేశారు. అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు భూముల విషయంలో ఏం కావాలో ప్రతిపక్షాలు అడగకలేకపోయాయని ఆయన అన్నారు. హుడాపై వేసిన కేసుల్లో 20 కేసులను హైకోర్టు కొట్టివేసిందని ఆయన చెప్పారు. తిరుమల ప్రధానార్చకుని ఇంట్లో ఆయన సుదర్శన యాగం చేశారు. సమాజం సుభిక్షంగా ఉండాలనే తాను ఈ యాగం చేసినట్లు ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్ర మహాభారతం గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకుండా తగిన చట్టాలు తెస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
