సెమ్ ఇండియా దివాళా కంపెనీ: బిజెపి
హైదరాబాద్: ఫ్యాబ్ సిటీ ఏర్పాటు కోసం సెమ్ ఇండియాకు 1200 ఎకరాల భూమిని కేటాయించి, దానికి కల్పించిన సౌకర్యాల గడువును ప్రభుత్వం పొడిగిస్తూ పోవడాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి తప్పు పట్టారు. సెమ్ ఇండియా ఇప్పటి వరకు ప్రాజెక్టు స్థాపనలో ఏ విధమైన ప్రగతి సాధించలేదని, ప్రహారీగోడ కట్టడమూ ఫెన్సింగ్ వేయడమే ప్రగతిగా ఆ కంపెనీకి చెందిన అగర్వాల్ చెప్పుకుంటున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గత పదేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న సెమ్ ఇండియా ప్రాజెక్టును విజయవంతంగా ఎలా నెలకొల్పుతుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
సెమ్ ఇండియా ఉత్పత్తులు కూడా చేపట్టడం లేదని, కేవలం అసెంబ్లింగ్ మాత్రమే చేపడుతుందని, అంత మాత్రానికి 1200 ఎకరాల భూమి కేటాయించడం సరైంది కాదని ఆయన అన్నారు. పేదల భూములను ప్రభుత్వం కంపెనీలకు కట్టబెడుతూ వుండడాన్ని ఆయన వ్యతిరేకించారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వ్యవహారంపై తమ పార్టీ దళిత మోర్చా రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సైకిల్ యాత్ర నిర్వహిస్తుందని బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. ఈ సైకిల్ యాత్ర 70 గ్రామాల్లో 210 కిలోమీటర్ల మేర జరుగుతుందని ఆయన చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
