రాష్ట్రపతిని కలిసిన అఫ్జల్ కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన మొహమ్మద్ అఫ్జల్ గురు కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను కలిశారు. అఫ్జల్ తల్లి అయేషా బేగం, భార్య తబస్సమ్, ఏడేళ్ల కుమారుడు గాలిబ్ రాష్ట్రపతి భవన్‌లో కలామ్‌ను కలిశారు. వారి వెంట సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది నందితా హక్సర్ ఉన్నారు. అఫ్జల్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని వారు రాష్ట్రపతిని కోరారు.
తాను డాక్టర్‌ను కావాలనుకుంటున్నానని, తన తండ్రి జీవించే వుంటేనే తన కల సాకారం అవుతుందని గాలిబ్ రాష్ట్రపతితో అన్నట్లు సమాచారం. అఫ్జల్ కేసులో న్యాయం జరగగలదని ఆశిస్తున్నామని రాష్ట్రపతిని కలిసిన అనంతరం అఫ్జల్ కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాశ్మీరీలం అయినందున తమకు తగిన న్యాయం జరగలేదని, తన భర్త విచారణ సరిగ్గా జరగలేదని, తన భర్త వాదించడానికి ఏ స్థాయిలోనూ న్యాయవాది లేడని అఫ్జల్ భార్య చెప్పింది. మెర్సీ పిటిసన్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపింది. ఈ విషయాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని ఆమె అన్నది. తన భర్త మెర్సీ పిటిషన్‌ను వ్యతిరేకించడం లేదని, అతనికి న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లినట్లుందని ఆమె వివరించింది.












Click it and Unblock the Notifications
