పోటీ చేస్తే తెరాస వుండదు: కేశవరావు
కరీంనగర్: కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉండనే ఉండదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. కరీంనగర్‌లో తమ పార్టీ పోటీ చేస్తుందని, గెలుస్తుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము కరీంనగర్ ఎన్నికలో అభివృద్ధితో పాటు తెలంగాణ సెంటిమెంట్‌ను కూడా ఎజెండాగా వుంచుతామని ఆయన చెప్పారు. తెరాస అసలు పోటీలోనే ఉండదని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, నరేంద్రల రాజీనామాలు బూటకమని ఆయన అన్నారు. మంత్రి ఎం. సత్యనారాయణరావుపై కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, సత్యానారాయణరావు అనుభవంలో కాలిగోటికి కూడా కెసిఆర్ అనుభవం సరిపోదని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణపై కెసిఆర్ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. కరీంనగర్ ఉప ఎన్నికకు ముందైన తెలంగాణపై ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి వుందని ఆయన అన్నారు.
సహకార ఎన్నికల సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెరాసకు బలం లేదని తాను అన్నానని, అప్పుడెందుకు తెరాస నేతలు రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సొత్తు కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తమ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెరాసకు చెందిన ఐదుగురు పార్లమెంటు సభ్యులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. తెలంగాణ ఏర్పాటు ప్రభుత్వం వల్ల కావాలి లేదా మెజారిటీ సభ్యులున్న పార్టీ ద్వారా జరగాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తమ పార్టీ మాత్రమే ఇస్తుందని, తమ పార్టీ మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
