సిట్టింగ్ జడ్జితో విచారణకు వెంకయ్య డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణ అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణలో కేవలం అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై వచ్చిన ఆరోపణలను మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా చేర్చడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దలపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ నిర్దిష్టంగా, నిర్ణీత కాలవ్యవధి ప్రమాణంగా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఐయంజి భూముల అప్పగింత వంటి అనేక విషయాలపై విచారణ జరిపించదలుచుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే అవుటర్ రింగ్ రోడ్డు భూముల సేకరణ ఆరోపణలపై నిర్దిష్టంగా జరగాలని, నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తయ్యేలోగా చూడాలని ఆయన అన్నారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్‌కు క్షమాభిక్ష పెట్టకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు పెట్టిన గడువు రోజుననే అఫ్జల్‌ను ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
