టెక్ మధు, సుధారాణి వరంగల్‌లో లొంగుబాటు
హైదరాబాద్: రాకెట్ లాంచర్ల కేసులో నిందితులు టెక్ మధు, సుధారాణి మంగళవారం వరంగల్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. క్రాంతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఇటీవల పోలీసులు మావోయిస్టులకు చేరవేయడానికి ఉద్దేశించిన రాకెట్ లాంచర్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుధారాణి, మధులను నిందితులుగా గుర్తించారు. వీరు ఆ వెంటనే పరారీ అయ్యారు. వారు ఎట్టకేలకు మంగళవారం లొంగిపోయారు.
ఇదే సమయంలో పోలీసులు మరోసారి విజయవాడ ప్రాంతంలోని క్రాంతి ట్రాన్ప్‌పోర్టు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాల బ్యాగులు నెల్లూరు నుంచి విజయవాడకు ఆ తర్వాత కొమరవోలుకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కొమరవోలులో వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో వాటిని పోలీసులు తెప్పించుకున్నారు. వీటిని రంగస్వామి అనే వ్యక్తి బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చీరాలలోని క్రాంతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ పేలుడు పదార్థాలేవీ లభించలేదు. అయితే ఇనుపముక్కలున్న బ్యాగులు మాత్రం పోలీసుల చేతికి చిక్కాయి. ఇదిలావుంటే, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications