మాంసాహార భోజనానికి శిక్ష వేసుకున్న నారాయణ
హైదరాబాద్: గాంధీ జయంతినాడు మాంసాహారం తిన్నందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాంధీ జయంతినాడు మాంసాహారం భుజించడం తప్పేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అందుకు శిక్షగా వచ్చే గాంధీ జయంతి వరకు తాను మాంసాహారం తినబోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు. తాను తెలిసి చేసిన తప్పు కాదని, యాదృచ్ఛికంగా జరిగిపోయిందని ఆయన అన్నారు.
గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ఆయన ఇడ్లీలో చికెన్ నంజుకుని తిన్నారు. ఆయన చికెన్ తింటున్న ఫొటోను ఒక తెలుగు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేదలకు భూములు పంచాలని కోరుతూ చినగంజాం నుంచి చీరాల వరకు మంగళవారంనాడు పాదయాత్ర జరిగింది. గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నారాయణకు నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ విందులో ఆయన చికెన్ తిన్నారు.












Click it and Unblock the Notifications
